తన మొదటి మూడు చిత్రాల (మన్మధ, గజని, పందెంకోడి) తోనే అందరినీ ఆకట్టుకొన్న రచయిత శశాంక్ వెన్నెల కంటి. డబ్బింగ్ చిత్రాలకు మాటలు, పాటలు అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొన్న వెన్నెలకంటి తనయుడి గా కాకుండా తనకంటూ ఒక గుర్తింపు ను శశాంక్ సంపాదిచుకొన్నారు. మాటల రచయితగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా శింబు వంటి వారికి తెలుగు గాత్రదానం చేసిన శశాంక్ తన లక్ష్యం మాత్రం దర్శకత్వమే అంటున్నారు. జూన్ 26 శశాంక్ జన్మదినోత్సవం సందర్భంగా చెన్నై లో వున్న ఆయన తో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. డబ్బింగ్ చిత్రాలకు మాటలు రాయడంలో వున్న సాధక బాధకాల గురించి ఆయన తన అభిప్రాయలను తెలియజేసారు. ఆయనతో జరిపిన సంభాషణ వివరాలు . . . . .
శశాంక్ గారూ ముందుగా మీకు మా టోటల్
టాలీవుడ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు
Thank you very much . . . .
ఇప్పటి వరకూ మీరు మొత్తం ఎన్ని చిత్రాలకు మాటలు అందించారు . . . .
నా కెరీర్ మన్మధ చిత్రం తో మొదలయ్యిందండీ, ఇక అప్పటినుండీ ఒక దాని తర్వాత ఒకటి దాదాపు గా నలభై చిత్రాల వరకూ నేను వర్క్ చేసాను. అయితే మన్మధ చిత్రం వెంటనే వచ్చిన గజనీ, పందెంకోడి చిత్రాలు మంచి విజయాలు సాధించడం వల్లనే నాకు అవకాశాలు శరపరంపర గా వచ్చాయనుకొంటాను.
మీరు ఈ రంగం లోనికి ప్రవేశించడం ఎలా జరిగింది . . .
నిజానికి నేను ఎప్పుడూ ఈ ఫ్రొఫెషన్ లోనికి వద్దామనే అనుకోలేదు. అయితే మన్మధ జరుగుతున్న సమయం లో ఆ చిత్ర నిర్మాత కృష్ణ ప్రసాద్ గారు మీరెందుకు వ్రాయకూడదు అంటూ నా చేత వ్రాయించడం జరిగింది. ఇక అప్పటి నుండీ అలా రాస్తూనే వున్నాను. చిత్ర దర్శకుడు కావాలన్నది నాకు చిన్నప్పటి నుండీ వున్న కల, నేను విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చదువుకొన్నాను. చిత్ర రంగంలో అడుగు పెట్టింది కూడా ఒక సహాయ దర్శకుడి గానే, కమల్ హాసన్ గారి పోతురాజు, ముంబాయ్ ఎక్స్ ప్రెస్ చిత్రాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను.
అనువాద చిత్రాలకు పని చేయాలీ అంటే అయా భాషల మీద సరైన పట్టు వుండడమే కాకుండా సాహిత్యం మీద కూడా సరి అయిన అవగాహన వుండాలి అంటారు . . . ఈ విషయం లో మీ ఉద్దేశ్యం ఏంటి .
అవును . . భాషల మీద పట్టు వుంటే చాలు అనువాదం చాలా ఈజీ నే అనుకోవడం ఒక రకంగా తప్పు అనే అంటాను. తప్పకుండా సాహిత్యం మీద కూడా అవగాహన వుండాలి. నా వరకూ నేను చదువుకొన్నది అంతా చెన్నై లోనే అయినా, తెలుగు సాహిత్యం మీద తగని మక్కువ నాకు, చిన్నప్పటి నుండీ పుస్తకాలు చదువుతూనే వున్నాను. ఈ రోజు నేను ఈ పొజిషన్ లో వుండడానికి కారణం కూడా అదే అని చెప్పవచ్చు. ఇలా ఎందుకు అంటున్నా అంటే, తమిళ్ నుండి తెలుగు కు రాసేప్పుడు ముఖ్యంగా చూడవలసిన అంశాలు కొన్ని వున్నాయి. మొదటిది లిప్ సింకింగ్ రెండవది "ఫ్లో", అంటే ఒక హీరో గానీ కమేడియన్ గానీ మాట్లాడుతున్నప్పుడు యెక్కడా బ్రేక్ అన్నది వుండకూడదు,మనం రెగ్యులర్ గా ఎలా మాటాడుకొంటామో వాళ్ళూ కూడా అలానే మాట్లాడుతూ వుండాలి. చూసే వారికి అది స్ట్రైట్ చిత్రం అన్న ఫీలింగ్ కలగాలి మరి at the same time లిప్ సింకింగ్ కూడా వుండాలి. అలాగే ఆయా సీన్ల తాలూకా భావం కూడా పాడవకూడదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకొంటేనే ఫైనల్ అవుట్ పుట్ చక్కగా వస్తుంది.
మరి దర్శకుడు కావాలన్న మీ కల ఎంత వరకూ వచ్చింది . . .
తొంభై శాతం ఈ సంవత్సరం లోనే నేనొక చిత్రాన్ని డైరెక్ట్ చేయబొతున్నాను. నిజానికి అవకాశాలు రావడం అయితే బాగానే వచ్చాయి గానీ నేను కూడా పూర్తిగా సిద్దం అయిన తర్వాతనే చేద్దామనుకోవడం వల్ల ఇప్పటి వరకూ ఆగాల్సి వచ్చింది.
మీ మీద మీ నాన్నగారి ప్రభావం ఎంత వరకూ వుంటుంది . . .
డెఫినెట్ గా నాన్న గారి ప్రభావం నా మీద వుంది. నిజానికి ఆయనవల్లనే నాకు సాహిత్యాభిలాష అన్నది కలిగింది. ఇప్పటికీ నాకు ఎటువంటి సందేహాలు వచ్చినా నాన్నగారి వద్దనే క్లియర్ చేసుకొంటూ వుంటాను. మామద్య యెప్పుడూ ఈ విషయాల మీద చర్చలు జరుగుతూనే వుంటాయి.
సాహిత్యం మీద అభిలాష వుందన్నారు కేవలం చదవడం మాత్రమేనా, లేక మీరు కూడా యేమన్నా వ్రాస్తున్నారా . . .
అవునండీ . . . నేను ప్రస్తుతం ఒక పుస్తకం వ్రాస్తున్నాను, త్వరలోనే అది పబ్లిష్ కాబోతుంది. The book is about flow of thoughts, చలం గారి మ్యూజింగ్స్ ని స్పూర్తిగా తీసుకొని వ్రాసాను.
డబ్బింగ్ చిత్రాల వల్ల తెలుగు చిత్రరంగానికి నష్టం జరుగుతుంది అన్న వాదన మీద మీ కామెంట్ . . .
అలా ఏం లేదండీ, ఇక్కడ షూటింగ్ చేయడం లేదు అన్న ఒక్క విషయమే తప్పా, డబ్బింగ్ చిత్రాల వల్ల కూడా ఉపాధి పెరుగుతోందనే చెప్పాలి. కొంచం గుర్తింపు తెచ్చుకొంటే ఆదాయం కూడా ఎక్కువగానే వుంటుంది. అందువల్ల నేను డబ్బింగ్ చిత్రాల వల్ల మన సినీ రంగానికి నష్టం అన్న విషయం తో ఏకీభవించను . . .
మీకు డైరెక్ట్ తెలుగు చిత్రాలకు పని చేసే అవకాశాలు ఎందుకు రావడం లేదు . . .
అవకాశాలు రాకపోవడం అంటూ ఏమీ లేదు, డబ్బింగ్ చిత్రాలతో బిజీ గా వుండడం వల్ల మేము చేయలేకపొతున్నాం తప్పా, అవకాశాలు రాకపోవడం వల్ల కాదు. అంత వరకూ ఎందుకు ఇప్పుడు నేను ప్రస్తుతం కధానాయకుడు చిత్రానికి కొన్ని సీన్లు వ్రాస్తున్నాను. త్వరలోనే మరికొన్ని డైరెక్ట్ తెలుగు చిత్రాలకు కూడా వ్రాసే అవకాశం వుంది.
శశాంక్ గారూ మీరు మీ గోల్ అయిన దర్శకత్వ భాద్యతను తొందర్లోనే చేపట్టాలని ఆశిస్తూ . . మీకు మరొక్క సారి జన్మదిన శుభాకాంక్షలు . . .
Thank you very much . . .