MAA stringent against rubbish talk on artists
14-Sep-2008
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన అద్యక్షుడి గా మురళీమోహన్ ఎన్నికయ్యారు. అద్యక్షుడి పదవి గానూ జరిగిన పోటీలో ప్రధాన అబ్యర్ధి విజయ చందర్ పై మురళీమోహన్ 108 ఓట్ల తేడాతోనూ ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన పోటీలో అయ్యప్ప శర్మ పై ఆహుతి ప్రసాద్ 140 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆదివారం ఉదయం నుండీ జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు సాయంత్రం ఆరున్నర గంటలకు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఎన్నికైన వారంతా సినీపరిశ్రమ లో చోటు చేసుకొన్న పలు సమస్యల పై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్యవర్గ సభ్యులు గా అశోక్ కుమార్, ఎవిఎస్, రాజీవ్ కనకాల, కాదంబరి కిరణ్ కుమార్, మాణిక్, నర్శింగ్ యాదవ్, రమ్యకృష్ణ, బెనర్జి, బ్రమ్మాజీ, హేమ, గౌతం రాజు, బెంగుళూరు పద్మ, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శివకృష్ణ, వేణుమాదవ్, హీరో వేణు, వినోద్ బాల లు ఎన్నికయ్యారు. ఈ సభ్యుల కాలపరిమితి రెండు సంవత్సరాలు. ఈ ఎన్నికలకు లాయర్ కృష్ణమోహన్ ఛీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ పేద సినీకళాకారులకు గృహవసతి కల్పించడానికి తాను శాయశక్తులా కృషి చేస్తాననీ, అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా సినిమావారిపై రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలను నటుడు ఎవిఎస్ ప్రస్తావించినపుడు, వ్యక్తిగతం గా వివిధ పార్టీల వారున్నా సినిమాపరం గా మేమందరం ఒక్కటే పార్టీ అనీ, మా గురించి ఏ ఒక్కరు అవాకులు చవాకులూ పేలినా ఊరుకొనేది లేదనీ త్వరలోనే దీనిపై ఒక తీర్మానం కూడా చేయదలచామని మురళీమోహన్ చాలా కటువు గా సమాదానమిచ్చారు. నూతన కమిటీ తో ప్రమాణ స్వీకారం చేయించడానికి విచ్చేసిన గౌరవాద్యక్షుడు అక్కినేని నాగేశ్వర రావు కూడా ఈ విషయం పై వాఖ్యానిస్తూ, సినిమావారు ప్రపంచం లో ఎటువంటి సంచలనాన్నైనా సృష్టించగలరనీ వారికి ఆ శక్తి వుందనీ, వారి గురించి ఆరోపణలు మానుకోవడం మంచిదని అంటూ, సినిమానుండి రాజకీయాలలోనికి వెళ్ళవచ్చు గానీ , ఇక్కడ మాత్రం రాజకీయాలనేవి లేవనీ, తామందరూ దానికి అతీతం అనీ అన్నారు.
|