Rotary Club brings back Aalayam to theaters
13-Aug-2008
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం లో కుటుంబ కధా చిత్రం గా వచ్చిన ఆలయం చిత్రం ప్రేక్షకుల కనీస ఆదరణకు నోచుకోక పోవడం వల్ల విడుదల అయిన మొదటి వారమే అన్ని చోట్లా షో లు తీసివేయడం జరిగింది. కానీ ఈ చిత్రాన్ని చూసిన పలువురు పెద్దలు, ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకుల మద్యకు తీసుకు వెళ్ళాలనీ ఈ చిత్రాన్ని మళ్ళీ విడుదల చేయిస్తున్నారు. ఈ నెల పదిహేను నుండీ నారాయణ గుడా వెంకటేశ్వరా థియేటర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతను, వాటి ప్రాముఖ్యతను చక్కగా వివరించిన ఈ చిత్రం చాలామందికి కనివిప్పు కలిగిస్తుందనీ, ఇంతకుముంది తాను తీసిన సగటుమనిషి, కలికాలం వంటి చిత్రాలు కూడా మొదట ఏమాత్రం ఆడలేదనీ అయితే నెమ్మదిగా పికప్ అయ్యి వందరోజులు పూర్తిచేసుకొన్నాయని దర్శకుడు ముత్యాల సుబ్బాయ్య అన్నారు. ఈ చిత్రాన్ని తాను తన కుటుంబం తో కలిసి చూసాననీ చూడగానే ఇటువంటి చిత్రాలను ప్రజల్లోనికి తీసుకువెళ్ళాలన్న ఆలోచనతో ఈ చిత్రాన్ని మళ్ళీ రిలీజ్ చేయడానికి తగిన చర్యలు రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ చేపడుతుందని క్లబ్ అద్యక్షుడు సామల వేణు అన్నారు. ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించిన కె బి తిలక్ మాట్లాడుతూ తాను దర్శకుడి గా చిత్రాలు తీస్తున్న సమయం లో ప్రజల వద్దకే సినిమా అనే పద్దతిని ప్రభుత్వం దృష్టి కి తెచ్చాననీ, కాలానుగుణం గా ప్రభుత్వాలతో పాటూ అవన్నీ మరుగున పడిపోయాయనీ, చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడమే గగనం, ఒకవేళ దొరికినా ఎక్కడో ఊరవతల దోమలూ నల్లులూ వున్న థియేటర్లు లబిస్తున్నాయని సినిమా ఎంత బాగున్నా అక్కడికి వెళ్ళి ఎంతమంది చూస్తారనీ ఆయన అంటూ అందువల్లనే ఇలాంటి చిత్రాలను ప్రజలవద్దకే తీసుకువెళ్ళాలని అన్నారు. ఒక్క ప్రింట్ పట్టుకొని ఊరూరా తిరిగి తక్కువ రేట్ కే చిత్రాన్ని ప్రదర్శించినా నిర్మాత లాభాలు చవిచూస్తాడని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన రాజకీయవేత్త మల్లు రవి మాట్లాడుతూ సినిమాల యొక్క ప్రభావం సమాజం మీద ఎంతైనా వుందనీ, అందువల్ల ఇలాంటి చిత్రాలను ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళాలనీ, ఈ రోజుల్లో హీరోలు తమ చివరిదశ కి వచ్చేసరికి ప్రజాసేవ అంటూ రాజకీయాల్లోనికి వస్తున్నారనీ మరి వారు ఎంత వరకూ తమ నిబద్దతను కాపాడుకొంటారో చూడాలనీ అంటూ తిలక్ గారు చెప్పిన సూచనలను తాను సంబందిత మంత్రికి తెలియజేస్తానని అన్నారు.
|